హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెండు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కొలువుదీరనున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో శుక్రవారం జపాన్‌కు చెందిన నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్, డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ పరిశ్రమలకు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు. రూ.450 కోట్ల పెట్టుబడితో డైఫుకు సంస్థ తన రెండో తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తుండగా, నికోమాక్ తైకిషా రూ.126.2 కోట్లతో మూడో పరిశ్రమను నెలకొల్పుతున్నది. ఈ రెండు కంపెనీలు రాష్ట్రంలో తమ పెట్టుబడి విస్తరణ కోసం నిరుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
జపాన్‌కు చెందిన మరో సంస్థ డైఫుకు రూ.450 కోట్ల పెట్టుబడితో చందన్వెల్లిలో ఏర్పాటు చేయనున్న ఇంట్రాలాజిస్టిక్స్ ఎక్విప్మెంట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలో 18 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. రెండు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మన దేశానికి చెందిన వెగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీతో కలిసి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశలో రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. 800 మందికి ఉపాధి లభించనుండగా, తొలి దశలోనే 250 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. దీనిలో కన్వేయర్స్, షార్టర్స్ ఉత్పత్తి చేయనున్నది.