హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన నలుగురు ఆడపిల్లలకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సాయం అందింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలానికి చెందిన ములకలపల్లి వీరయ్య, కోటమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు. నాలుగేండ్ల క్రితం వీరయ్య చనిపోగా, గురువారం రాత్రి అనారోగ్యంతో కోటమ్మ కన్నుమూసింది. దీంతో ఆ ఆడపిల్లల దయనీయస్థితిని ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి.. పిల్లలకు సాయమందించాలని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజ్ను ఆదేశించారు. శనివారం అధికారుల బృందం పిల్లలను కలిసి సాయం అందించింది. ‘గుడ్ జాబ్’ అంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులను మంత్రి ట్వీట్ ద్వారా అభినందించారు.
లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధపడుతున్న వనపర్తి జిల్లా గోపాల్పేట మండలానికి చెందిన నరేశ్‌కుమార్‌కు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. రెండు నెలల్లో లివర్ మార్చకపోతే నరేశ్ చనిపోతాడని వైద్యులు తెలిపారని, ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేయగా.. నిమ్స్‌లో అవయవ మార్పిడి చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా చెయ్యూర్లో శనివారం పెళ్లి చేసుకొన్న జంటకు స్నేహితులు లీటర్ పెట్రోల్, డీజిల్ బాటిళ్లను బహుమతిగా ఇచ్చారు. ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీలో వచ్చిన ఈ సరదా వార్త, అందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.