చిన్నశంకరంపేట/పెంబి, సెప్టెంబర్17 : భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం.. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గిరిజన తండాకు చెందిన రైతు లంబాడీ రవీందర్(45) కూతుళ్ల పెండ్లిళ్ల కోసం రూ.3.5 లక్షలు. కూరగాయల సాగుకోసం మరో రూ.2 లక్షలు అప్పు చేశాడు. భారీ వర్షాలకు కూరగాయల పంట దెబ్బతింది. దీంతో మనోవేదనకు గురై మంగళవారం పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వర్షానికి పంట కొట్టుకుపోయిందని..
పెంబి మండలం మందపల్లికి చెందిన రైతు బొమ్మెన పెద్దులు(51) తనకున్న రెండెకరాల్లో పత్తి, పసుపు వేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పత్తి, పసుపు పంట కొట్టుకుపోయింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని మంగళవారం ఉదయం తన చేనులో పురుగుల మందు తాగాడు.