మక్తల్ : మహబూబ్నగర్ జిల్లాలో ఘోరం జరిగింది. మక్తల్ ( Maktal ) మండలంలోని రెండు గ్రామాల్లో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. ఆదివారం వాతావరణంలో మార్పులో భాగంగా, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడిన సంఘటనలో పిడుగుపాటుకు( Lightning Strike ) గురై ఇద్దరు వ్యక్తులు, ఒక ఎద్దు, ఆవు మృతి చెందింది .
మధ్యాహ్నం రెండున్నర గంటలకు భారీ స్థాయిలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమై సూపర్పల్లి గ్రామం వద్ద పిడుగు పాటుకు గురై భవన నిర్మాణ కార్మికుడు అంజప్ప (30) అనే వ్యక్తి మృతి చెందాడు. దాదనపల్లి గ్రామంలో కురువ కురుమూర్తి (16) అనే యువకుడు సైతం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.
మక్తల్ మున్సిపాలిటీలో 8వ వార్డు కొత్త గార్లపల్లిలో కర్రే లక్ష్మప్ప అనే రైతుకు చెందిన కాడేద్దులు వ్యవసాయ పొలంలో మేత మేస్తున్న క్రమంలో పిడుగు పడటంతో ఎద్దు పొలంలో మృతి చెందింది. వర్షానికి వరి పంటను కోసి ఆరబెట్టుకున్న ధాన్యం తడిసింది. మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ మండలం కాందోటి గ్రామానికి చెందిన రైతు నూకలు తాయప్ప వ్యవసాయ పొలంలో పిడుగు పడటంతో ఆవు మృతి చెందింది.