హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి సౌరాష్ట్ర వరకు ఉన్న ద్రోణి మంగళవారం బలహీన పడింది. నైరుతి దిశనుంచి కిందిస్థాయి గాలులు బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రమంతా మబ్బులు కమ్మాయి. బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురువొచ్చని తెలిపింది. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మో స్తరు వర్షం కురిసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా వైరాలో 4.9 సెంటీమీటర్ల వాన పడింది.