మహబుబాబాద్ : కొత్తగూడ మండలం ఎంచగూడెంలో విషాదం చోటుచేసుకుంది. దసరా పండుగ కోసమని ఇటీవలే ఎంచగూడెం గ్రామానికి ఇటికాల నర్సయ్య, స్వాతి దంపతుల కుమారుడు రితిక్, నర్సయ్య సోదరి అనిత, శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. అయితే వీరి బంధువు ఒకరు చనిపోవడంతో.. కుటుంబ సభ్యులందరూ వేరే గ్రామానికి వెళ్లారు.
ఇంటి వద్ద ఉన్న రితిక్, జతిన్ కలిసి.. గ్రామ శివార్లలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు బహిర్భుమికి వెళ్లారు. ఇద్దరు కూడా ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. బావిలో తేలియాడుతున్న పిల్లలను చూసి స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. కొత్తగూడ ఎస్ఐ రాజ్ కుమార్ తన బృందంతో ఘటనాస్థలానికి చేరుకుని రితిక్, జతిన్ మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. ఇద్దరు పిల్లలు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.