ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 21:02:55

బట్టలు ఉతికేందుకు వెళ్లి..

బట్టలు ఉతికేందుకు వెళ్లి..

అలంపూర్‌: తుంగభద్ర నదిలో బట్టలు ఉతికేందుకు మహిళతో పాటు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళవారం చోటు చేసుకున్నది. ఎస్సై మధుసూధన్‌రెడ్డి కథనం మేరకు.. అలంపూర్‌ మండలంలోని గుందిమల్ల గ్రామ శివారులోని తుంగభద్ర నదిలో గుందిమల్లకు చెందిన హరిణి తన ముగ్గురు పిల్లలతో పాటు ఆమె అన్న పిల్లలు ఇద్దరితో కలిసి నదిలో బట్టలు ఉతికేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హరిణి బట్టలు ఉతుకుతుండగా, ఐదుగురు పిల్లలు మానస, మైథిలి, మధుప్రియ, దీక్షిత, చంద్రకళ నీటిలోకి ప్రవేశించారు. 

ఇందులో నలుగురు నీటిలో మునిగి పోగా ఓ చిన్నారి బయటకు వచ్చి, హరిణికి తెలుపడంతో ఆమె కేకలు వేయగా చుట్టు పక్కల పొలాల్లో పనులు చేస్తున్న రైతులు హుటా హుటిన చేరుకుని ఇద్దరు పిల్లలను రక్షించారు. మరో ఇద్దరు దీక్షిత (8), మైథిలి(10) అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన చిన్నారుల్లో హరిణి అన్న కూతురు దీక్షిత, హరిణి కూతురు మైథిలి ఉన్నారు.