హైదరాబాద్ : ఎండలో ఆడుకోవద్దన్నందుకు ఒకరు.. నచ్చని హెయిర్ కటింగ్(Hair cutting) చేయించారని మరొక బాలుడు(Two boys) ఆత్మహత్యలకు(Committed suicide) పాల్పడ్డారు. ఈ హృదయవిదాకర సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన సిద్దు(9) మూడో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఆడుకుంటున్నాడు. దీంతో ఎండలో తిరగవద్దని తల్లి మందలించింది.
దీంతో మనస్తాపానికి గురైన సిద్దు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో సంఘటనలో మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన కాంతారావు చిన్న కుమారుడు హర్షవర్ధన్ (9) హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. వేసవి సెలవులకు ఇంటివద్దకు వచ్చాడు. కాగా, తండ్రి ఇష్టం లేని హెయిర్ కటింగ్ చేయించాడని హర్షవర్ధన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.