హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఐరోపా దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 7 లక్షల వరకు వసూలు చేసిన నిందితుల్లో ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఆమె గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కేపీహెచ్బీలో ‘అబ్రాడ్ స్టడీ ప్లాన్ కన్సల్టెన్సీ’ పేరుతో మాల్టా, లాట్వియాలలో ఉద్యోగం ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. నిందితులైన ఘంటా సునీల్, ఘంటా అనిల్, కొట్టు సాయి రవితేజ, కొట్టు సాయిమనోజ్, శుభం, వంశీ తదితరులు విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీలో బ్రాంచ్‌లు నిర్వహిస్తూ 100 మందికిపైగా బాధితులను మోసం చేశారు.
నిర్మల్ జిల్లాకు చెందిన కార్పెండర్ గోనె శ్రీనివాస్ నుంచి రూ.7 లక్షల వరకు తీసుకున్నారు. నకిలీ వీసాలతో విదేశాలకు పంపగా అక్కడికి వెళ్లినా ఎలాంటి ఉద్యోగాల్లేక స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో బాధితుడు ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. సీఐడీ డీజీ శిఖాగోయెల్ ఆదేశాల మేరకు ఈవోడబ్ల్యూ ఎస్పీ, సిబ్బందితో కొట్టుసాయి రవితేజ, కొట్టు సాయి మనోజ్‌ను అరెస్టు చేశారు. వీరి అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సీఐడీ సిబ్బందిని డీజీ అభినందించారు.