హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో రాష్ర్టానికి కేంద్రం శూన్యహస్తమే ఇచ్చిందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ చేసిన ట్వీట్‌కు ఆయన దీటైన జవాబిచ్చారు. తెలంగాణ వైద్య కళాశాలల ఏర్పాటు, దవాఖానల ఆధునీకరణ విషయంలో కేంద్ర మంత్రి వాదనలోని డొల్లతనాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. అనేక రాష్ర్టాల నుంచి వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని, పక్షపాతం లేకుండా కేంద్రం వాటికి అనుమతులు ఇచ్చిందని మాండవీయ ట్వీట్ చేశారు. తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని పేర్కొన్నారు.
దీనిపై కేటీఆర్ స్పందిస్తూ 2015, 2019లో కేంద్ర ఆరోగ్య మంత్రులుగా జేపీ నడ్డా, హర్షవర్ధన్ పనిచేసిన సమయాల్లో రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనల కాపీలను జతచేశారు. ఎదుటివారిపై నెపం మోపేముందు ఒకసారి సమీక్షించుకోవాలని చురక అంటించారు. దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలు, 16 ట్రిపుల్ ఐటీలు, 4 ఎన్ఐడీ, 84 నవోదయ పాఠశాలలు, 2 ఐసర్లు, 7 ఐఐటీలు, 7 ఐఐఎంలు ఏర్పాటు చేస్తే.. ఒక్కటీ తెలంగాణకు మంజూరు చేయలేదంటూ కేంద్రం వైఖరిని ఎండగట్టారు. మన్సుఖ్ మాండవీయ ట్వీట్‌పై టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కూడా చెలరేగిపోయారు. తెలంగాణకు నిధులు, వైద్య కళాశాలలు మంజూరు చేయకుండా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రమంత్రులు పచ్చి అబద్ధాలకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.