గణపురం, ఫిబ్రవరి 22: డబ్బా పాలు వికటించి నాలుగు నెలల కవల పిల్లలు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లపల్లిలో ప్రపంచ కవలల దినోత్సవం రోజే జరిగింది. వివరాల్లోకి వెళ్తే గొల్లపల్లికి చెందిన మర్రి అశోక్-లాస్యశ్రీ దంపతులకు నాలుగు నెలల క్రితం రెండో సంతానంలో కవలు (పాప, బాబు) జన్మించారు. లాస్యశ్రీ పిల్లలతో ఇటీవల తల్లిగారిల్లు నగరంపల్లెకి వెళ్లింది. భర్త అశోక్ గణపురంలోని ఓ మెడికల్ షాపులో పాల పౌడర్ తీసుకొచ్చాడు. శనివారం ఉదయం 8 గంటలకు ఒకసారి, 10 గంటలకు మరోసారి ఆ పాలు తాగించి పిల్లలను పడుకోబెట్టింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పిల్లల్లో కదలిక లేకపోవడంతో అనుమానం వచ్చి చూడగా ముకుల్లోంచి పాలు కారుతూ కనిపించింది. దీంతో పిల్లలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అకడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారులు మృతి చెందినట్టు నిర్ధారించారు. పౌడర్ పాలు తాగడం వల్లే కవల పిల్లలు మృతి చెందినట్టు తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.