హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నేపాల్‌లో పబ్బుకి వెళ్లి ఒక పార్టీలో పాల్గొన్న వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డికి ఛత్తీస్‌గఢ్ యువజన కాంగ్రెస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పూర్ణచంద్రపాది లీగల్ నోటీసు పంపారు. వారం రోజుల్లోగా దీనికి సమాధానం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా అనేక మంది రాహుల్‌గాంధీ నేపాల్ వ్యవహారంపై స్పందించారని సతీశ్‌రెడ్డి గుర్తుచేశారు. ఇతర పార్టీల వారిపై చర్యలు తీసుకుంటామంటున్న కాంగ్రెస్ నేతలు.. సొంత పార్టీ నాయకులపై చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సాక్షాత్తు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాహుల్‌గాంధీ నేపాల్ పబ్బులో చైనాకు చెందిన నేపాల్ రాయబారితో వెళ్తే తప్పేంటని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.