భూత్పూర్, మే 12: రోడ్డు ప్రమాదంలో టీవీ సీరియల్ నటి పవిత్రాజయరాం మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం శేరిపల్లి (బీ) వద్ద 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. పవిత్రా జయరాం (42) కర్ణాటకలోని బెంగళూరు నుంచి చెల్లెలు కూతురు ఆపేక్ష, సహనటుడు చంద్రకాంత్, డ్రైవర్ శ్రీకాంత్‌తో కలిసి శనివారం కారులో హైదరాబాద్‌కు బయలుదేరింది. అర్ధరాత్రి శేరిపల్లి(బీ) వద్ద డివైడర్‌ను ఢీకొని.. హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు వెళ్తున్న వనపర్తి డిపో ఆర్టీసీ బస్సును గుద్దుకున్నది. ఈ ప్రమాదంలో పవిత్రతోపాటు కారులో ఉన్నవారందరూ గాయపడ్డారు. 108లో మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు తరలించగా..పవిత్ర అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పవిత్ర జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘త్రినయని’, ‘నిన్నేపెళ్లాడుతా’ సీరియల్స్‌లో నటించింది. మృతురాలికి భర్త శివకుమార్‌గౌడ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
కర్ణాటకలోని మండ్య ప్రాంతానికి చెందిన పవిత్ర.. కన్నడ టీవీ పరిశ్రమ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కన్నడలో ‘జోకలి’ సీరియల్‌తో నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. ‘రోబో ఫ్యామిలీ’, ‘గాలిపటా’, ‘రాధారామన్’, ‘విద్యా నాయక’ సహా పలు కన్నడ సీరియళ్లలో ప్రేక్షకుల మనసులను గెలిచారు.