హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్లూజే) నేతలు విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్‌లో ప్రత్యేక సదుపాయాలతో కూడిన ఉచిత వైద్యాన్ని అందించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ నేతృత్వంలో టీయూడబ్ల్యూజే నేతల బృందం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన జర్నలిస్టుల హెల్త్‌కార్డులు కేవలం నిమ్స్‌లో మాత్రమే చెల్లుబాటవుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో దాదాపు 23వేల మంది అక్రిడిటేటెడ్ జర్నలిస్టులు ఉన్నారని.. వీరి సౌలభ్యం కోసం భువనగిరిలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ఈ హెల్త్‌కార్డులు చెల్లుబాటు అయ్యేలా చూడాలని విన్నవించారు. స్పందించిన కిషన్‌రెడ్డి.. జర్నలిస్ట్లతోపాటు దివ్యాంగులకు ఎయిమ్స్‌లో ఉచితంగా వైద్యాన్ని అందించే దిశగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూనియన్ రాష్ట్ర కోశాధికారి యోగానంద్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు భాస్కర్, ఢిల్లీ అధ్యక్షుడు వెంకటేశ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు తిరుపతి పాల్గొన్నారు.