
నిజామాబాద్, జనవరి 25 : ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌పై రైతులు మరోసారి తిరగబడ్డారు. ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని మాటతప్పిన అర్వింద్‌పై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల రైతులు ఇస్సాపల్లి వద్ద ఎదురుతిరిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపైకి వాహనంతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అన్నదాతలు ఆగ్రహించారు. ప్రాణాలతో తప్పించుకొన్న రైతులు.. అర్వింద్ కాన్వా య్ వెంటపడ్డారు. చేతికందిన రాళ్లను వాహనాలపైకి విసిరారు. దాడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలపైకి ప్లకార్డు కర్రలతో దూసుకెళ్లారు. రైతుల ఆగ్రహానికి అర్వింద్ వాహనం ధ్వంసమైంది. రైతుల ప్రతిఘటనతో అర్వింద్ కంగుతిన్నారు. కారు దిగకుండానే అర్వింద్ వెళ్లిపోయారు.
పోలీసులు చెప్పినా వినని ఎంపీ..
పసుపు రైతులు గత మూడేండ్లుగా వివిధ రూపాల్లో అర్వింద్‌కు నిరసనలు తెలుపుతున్నారు. మంగళవారం ఆర్మూర్ నుంచి నందిపేటకు ఎంపీ వస్తున్నారని తెలిసి పరిసరప్రాంత ప్రజలంతా ఇస్సాపల్లి వద్ద నిరసన తెలుపాలని నిర్ణయించుకొన్నారు. ఎంపీగా గెలిచిన నాటి నుంచి పసుపు బోర్డు అంశాన్ని అర్వింద్ పట్టించుకోవడం లేదు. పైగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుతుండటంతో కర్షకులు ఆగ్రహంగా ఉన్నారు. గత నెల 29న ఇందల్వాయి మండలం గన్నారం వద్ద కూడా ఇదేవిధంగా రైతుల నుంచి నిరసన ఎదురైంది. ఆ సమయంలోనూ రైతులపైకి కారును ఎక్కించి అమానవీయంగా ప్రవర్తించడం కూడా వివాదాస్పదమైంది. ఆ ఘటనలో ఓ మహిళా హోంగార్డు గాయపడ్డారు. మంగళవారం ఆర్మూర్ పర్యటనకు వచ్చిన అర్వింద్.. ఇక్కడ కూడా రైతుల నుంచి తీవ్రప్రతిఘటన ఎదురవడంతో కంగుతిన్నాడు. రైతులు ఊహించని విధంగా తిరగబడటంతో ఏంచేయా తెలియని బీజేపీ ఎంపీ… పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. నందిపేట మండలానికి వెళ్లే మార్గంలో పసుపు రైతులు నిరసనలు చేస్తున్నారని.. పర్యటన వాయిదా వేసుకోవాలని ఆర్మూర్ పోలీసులు పదే పదే చెప్పినా వినలేదు. పర్యటన వాయిదా వేసుకొనేదే లేదని మొండిపట్టుపట్టారు. పైగా ఆర్మూర్ చౌరస్తాలో బీజేపీ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. చేసేది లేక పోలీసులు బందోబస్తు మధ్య ఎంపీని నందిపేటకు అనుమతించగా.. ఇస్సాపల్లిలో రైతుల కన్నెర్రతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
రైతులపై బీజేపీ నాయకుల దాడి..
ఇస్సాపల్లికి అర్వింద్ కాన్వాయ్ చేరుకోగానే రైతులు నినాదాలు చేశారు. ‘రైతుద్రోహి అర్వింద్.. పసుపుబోర్డు తేలేని ఎంపీ రాజీనామా ఎప్పుడు చేస్తావ్?’ అంటూ నినదించారు. హామీ ఇచ్చి మోసం చేసిన అర్వింద్ తమ ఊళ్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. అర్వింద్ వాహనం వెంట వచ్చిన బీజేపీ నాయకులు రైతులపై విరుచుకుపడ్డారు. వారిని పక్కకు నెట్టేసేందుకు ప్రయత్నించారు. ఎంపీ కాన్వాయ్‌కే అడ్డుపడతారా? అంటూ రైతులపై పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా బీజేపీ నాయకులు వినలేదు. అదేసమయంలో ఎంపీ అర్వింద్ సైతం తన వాహనాన్ని రైతులపైకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. కోపోద్రిక్తులైన అన్నదాతలు ఒక్కసారిగా ఎదురుతిరిగారు. దీంతో బీజేపీ నాయకులు తోకముడిచారు. దాదాపు కిలోమీటర్ దూరం వరకు రైతులు వారిని తరిమారు. కాన్వాయ్‌పైకి రాళ్లు విసిరారు. నిజామాబాద్ చేరుకొన్న అర్వింద్ నేరుగా పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజును కలిశారు. తనపై హత్యాయత్నం జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. కొద్దిసేపటికే కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయనకు సంబంధించిన యంత్రాంగం కలిసి తనపై దాడిచేయించారంటూ నోటికొచ్చినట్టు వాగారు.
పసుపు బోర్డుతో గెలిచి పత్తా లేడు..
బీజేపీ నేత అర్వింద్ తప్పుడు హామీలిచ్చి దొడ్డిదారిన ఎంపీగా గెలిచాడు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు. అర్వింద్‌కు పసుపు రైతులు బుద్ధి చెప్పడం ఖాయం.
-మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి