హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఎస్సెల్బీసీ..! కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో మొన్ననే కుప్పకూలిన సొరంగ ప్రాజెక్టు ఇది! తెలంగాణ సాగునీటి రంగంలో ఇదో పెద్ద చిక్కుముడి! టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో ఏకధాటిగా 43 కి.మీ సొరం గం తవ్వాలి. టీబీఎం ముందుకుపోవాలి తప్ప వెనక్కి రాలేదు. యంత్రం మొదలైందంటే నెలకు కనాకష్టంగా ఆరు మీటర్లు ముందుకుపోతే అదే గొప్ప! నిత్యం సాంకేతిక సమస్యలే! ఇలా 2008లో పనులు మొదలైతే తొమ్మిదిన్నర కి.మీ పెండింగే! చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యాన సొరంగం కుప్పకూలి.. ఇంకా ఆరుగురి అమాయకుల మృతదేహాలు మట్టిలోనే కూరుకుపోయి ఉన్నా యి. కనీసం వాటిని బయటికి తీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించలేని దౌర్భాగ్య పరిస్థితి!
‘మా తాతలు నేతులు తాగారు!’ అన్నట్టుగా నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను తామే కట్టామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నిర్వాకాలు అనీఇన్నీ కావు. ఏదో కొత్త టెక్నాలజీ పేరు చెప్పి కోట్ల రూపాయల టెండర్లు పిలవడం.. టెక్నాలజీ విఫలమై కాంట్రాక్టర్లు పారిపోవడం.. అప్పటికే ఆ విచిత్ర ప్రాజెక్టు అంచనా వ్యయం తడిసిమోపెడు కావడం.. చివరికి అదో గుదిబండ ప్రాజెక్టుగా మారడం ఆనవాయితీగా తయారైంది. ఇదే కోవలో నగరంలో లిబర్టీ నుంచి నింబోలి అడ్డా వరకు ఐదు కిలోమీటర్ల మేర ట్రెంచ్‌లెస్ టెక్నాలజీతో చేపట్టిన డ్రైనేజీ ప్రాజెక్టు నిలిచింది. రూ.76.43 కోట్ల అంచనాతో 2009లో ఈ ప్రాజెక్టు మొదలైంది. ఇప్పటివరకు అంచనా వ్యయం ఎంతయిందో కూడా అధికారులే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! నగరం నడిబొడ్డున లిబర్టీ నుంచి నింబోలి అడ్డా వరకు ఐదు కిలోమీటర్ల మేర.. ప్రధాన రహదారుల కింద భూమి లోపల సరాసరి 10-16 మీటర్ల లోతులో సొరంగాన్ని తవ్వుకుంటూ ఏకంగా 1800 ఎంఎం పైపులైన్ వేయాలి. మైక్రో టీబీఎం పని చేయడం లేదంటూ కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేసింది.
దీంతో గత కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారులు చిన్న చిన్న ముక్కలుగా పనులను విభజించి.. మాన్యువల్‌గా పూర్తి చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అసలు ప్రాజెక్టు చేపట్టక ముందే ఎక్కడ ఎలాంటి రాతిపొరలు ఉన్నాయి? ఇతర సాంకేతిక అంశాలపై సమగ్ర అధ్యయనమే లేదు. దాని ఫలితంగానే ప్రాజెక్టు ఆద్యంతం గందరగోళంగా తయారైంది. ఎలాగైనా కింగ్‌కోఠి నుంచి అంబర్‌పేట వరకు మరో నెలన్నరలో పను లు పూర్తి చేసి డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి కసరత్తు చేస్తున్నది. కానీ కీలకమైన లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వరకు పూర్తిగా రాతి ప్రాంతం (రాక్ ఏరియా) కావడంతో అక్కడ పనుల నిర్వహణ సవాల్‌గా మారనున్నదని అధికారులు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ మార్కు విచిత్రమైన ప్రాజెక్టు 16 ఏండ్ల తర్వాత కూడా కొలిక్కి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడ ఎస్సెల్బీసీలో టీబీఎం పేరుతో ముందుకు పోలేక.. వె నక్కి రాలేక.. చివరికి సొరంగం కుప్పకూలింది. నగరంలో డ్రైనేజీ ప్రాజెక్టులోనూ కాంగ్రెస్ మార్కు సొరంగం తవ్వలేక కాం ట్రాక్టు సంస్థ చేతులెత్తేస్తే ఇప్పుడు మాన్యువల్‌గా పనులు చేయించాల్సి వస్తున్నది.
ఈ ‘సొరంగాల’ నిర్వాకం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదు. నల్లమల అటవీ ప్రాంతంలోనే కాదు.. రాష్ట్ర రాజధానిలోనూ కాంగ్రెస్ మార్కు విచిత్ర ప్రాజెక్టు ఒకటి దశాబ్దంన్నరగా ఆపసోపాలు పడుతున్నది. అదీ.. టీబీఎంతోనే! కాకపోతే ఇది మైక్రో టన్నెల్ బోరింగ్ మిషన్. ట్రెంచ్‌లెస్ టెక్నాలజీతో నగరం నడిబొడ్డున ఐదు కి.మీ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టు అది! పనులు దక్కించుకున్న కాంట్రాక్టు కంపెనీ ‘ఇదెక్కడి టెక్నాలజీ బాబోయ్!’ అని అప్పుడే చేతులెత్తేసి పత్తా లేకుండా పారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మరో కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చి వెంటపడినా ఏడాదికి కిలోమీటరు తవ్వితే అదే గొప్ప! ఐదు కి.మీలలో నేటికీ ఇంకా 400 మీటర్ల వరకు సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది.