SLBC Tunnel | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం 8 మంది కార్మికుల ప్రాణాలను బలితీసుకున్నదా? గతంలో టన్నెల్లో ‘ప్రమాదకర జోన్’ గుర్తించామని కాంట్రాక్టు సంస్థ చెప్పినా సర్కారు పెడచెవిన పెట్టిందా? టన్నెల్ రాళ్లలో పటు త్వం తగ్గిందని.. కూలే ప్రమాదం ఉందని చెప్పినా ప్రభుత్వం మొండిగా ప్రాజెక్టు పనులను చేపట్టిందా? ‘ప్రమాదకర జోన్’ వద్ద భారీ నీటి ఊట ఉన్నదని చెప్పినా పట్టించుకోలేదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. 2020లో టన్నెల్‌లోని స్థితిగతులను సర్వే చేసే అంబర్గ్ టెక్ ఏజీ అనే సంస్థ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ‘సిస్మిక్ అంచనా నివేదిక’ను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం.. టన్నెల్ ప్రారంభమయ్యే ప్రదేశం నుంచి సరిగ్గా 13.88 కి.మీ, 13.91 కి.మీ వద్ద ప్రమాదకర జోన్ ఉన్నట్టు గుర్తించింది. ఆ ప్రాంతంలోని రాళ్లలో దృఢత్వం తగ్గినట్టు తేల్చింది. దీంతో పాటు సదరు జోన్లో నీటి ఊట ఉన్నట్టు నివేదికలో స్పష్టం చేసింది. భూకంప తరంగాలను రాతి ద్రవ్యరాశిలోకి ప్రసారం చేయడం ద్వారా ప్రమాదాన్ని సంస్థ లెక్కించింది.
నివేదికను ధ్రువీకరించిన కాంట్రాక్టు సంస్థ!
నివేదికను అందించిన విషయాన్ని ఎస్ఎల్బీసీ పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థ ‘జై ప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్’ ధ్రువీకరించినట్టు తెలిసింది. కానీ, పూర్తి వివరాలు తెలిపేందుకు నిరాకరించినట్టు సమాచారం. సర్వే చేపట్టి, నివేదిక తయారుచేసిన అంబర్గ్ టెక్ సంస్థ సైతం ఆ ‘డాటా కాన్ఫిడెన్షియల్’ అంటూ సమాధానాన్ని దాటవేసినట్టు తెలుస్తున్నది. రాతి శిల దృఢత్వం తగ్గడంతో పాటు నీటి ఊటకు అవకాశం ఉన్న ప్రదేశంలోనే ప్రమాదం జరిగినట్టు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నవారు చెప్పారు. ఈ జోన్ వద్ద మూడు మీటర్లు పైకప్పు కుంగినట్టు వెల్లడించారు. ఈ మొత్తం నివేదికను పనులు జరిగే ముందు కాంట్రాక్టు సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. 2020లోనే ఎస్ఎల్బీసీ సొరంగంపై మరో నివేదికను జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సొరంగం తవ్వకం పేలవమైన పద్ధతిలో ప్రారంభమైనట్టు అందులో అభిప్రాయపడింది. టీబీఎం ద్వారా నడిచే పొడవైన ఎస్ఎల్బీసీ టన్నెల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులో ఉన్నందున బోర్ హోల్స్ డ్రిల్లింగ్, డ్రిఫ్ట్లకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ మొండి వైఖరితోనే ప్రమాదం
సొరంగంలో ‘ప్రమాదకర జోన్’ ఉన్నట్టు కాంట్రాక్టు సంస్థ స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అవాంతరాలను వెల్లడించిన మరో నివేదికను సైతం ప్రభుత్వానికి ఇచ్చింది. పనులు చేపడితే జరిగే నష్టాన్ని కూడా వివరించింది. అయినా ఆ నివేదికలోని అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం తేలికగా తీసుకున్నది. ప్రాజెక్టులో ఉన్న ఆటంకాలు, ఇబ్బందులను సమగ్రంగా అధ్యయనం చేయకుండానే ఆఘమేఘాల మీద ప్రాజెక్టు పనులను మళ్లీ ప్రారంభించింది. నిపుణులతో చర్చించి ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ప్రమాదకర జోన్ వద్ద టీబీఎం మరమ్మతులు చేస్తుండగానే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి 500 మీటర్లలోనే మరో ప్రమాదకర జోన్ ఉన్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన తర్వాత సైతం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సరిగ్గా స్పందించకపోవడంతో ఇప్పటి వరకు 8 మంది ఆచూకీ దొరకలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు ఒక్కో రోజు ఒక్కో ప్రకటన చేయడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
మానిటరింగ్ లేకపోవడంతోనే
గత కొన్ని రోజులుగా ప్రమాదకర జోన్ వద్ద మట్టిపెల్లలు పడుతున్నాయని, నీళ్లు కారుతున్నాయని కార్మికులు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వ ఒత్తిడితో సదరు సంస్థ పనులను కొనసాగించింది. ప్రమాదానికి ముందు రోజు సైతం నైట్ షిఫ్ట్‌లో పనిచేసిన కార్మికులు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని, కార్మికులకు సూచించారు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రమాదం జరిగిందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నివేదికలను ప్రభుత్వం బేఖాతరు చేస్తూ.. టన్నెల్ పనులతో వేలకోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడంతో పాటు కార్మికుల కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చింది.