హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్లను మార్చనున్నారు. 32 గేట్లను తొలగించి, కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి తుంగభద్ర రివర్ బోర్డు టెండర్లు ఆహ్వానించింది. గతం లో టెండర్లను ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ ఇప్పుడు టెండర్లు కోరుతున్నది. వచ్చే నెల 8లోగా బిడ్లు దాఖలు చేయాలని ప్రకటనలో కోరింది. తుంగభద్ర డ్యామ్ భద్రతకు సంబంధించి గతంలో ఏకే బజాజ్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డ్యామ్‌ను పరిశీలించిన కమిటీ కొత్తగా స్టాప్‌లాగ్ సిస్టమ్ ఏర్పాటుతోపాటు గేట్లను మార్చాలని సూచించింది. ఎన్డీఎస్ఏ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే బోర్డు టెండర్లు ఆహ్వానించింది.
ఏపీదీ తొండివాదన ; మిగులు లేకున్నా ఉన్నదంటూ బుకాయింపు
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర సంస్థలు న్యాయపరమైన అభ్యంతరాలు లేవనెత్తుతున్నా కూడా పోలవరం బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం అదే తొండివాదనలను వినిపిస్తున్నది. మిగు లు లేకున్నా ఉన్నదంటూ బుకాయింపులకు దిగడమే గాక, దిగువకు వచ్చే జలాలన్నీ వాడుకునే హక్కు ఉన్నదంటూ దబాయిస్తున్నది. ఈ ప్రాజెక్టు ప్రీ ఫిజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్)పై సీడబ్ల్యూసీ ఇటీవల అనేక అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ఏపీ సమర్పించిన పీఎఫ్ఆర్లోని అనేక అంశాలపై వివరణలను కోరింది. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు ఇటీవల ఏపీ సర్కారు సమాధానమిస్తూ లేఖ రాసింది. ఆ లేఖలో కొత్త విషయాలు ఏమీ లేకపోగా, ఆది నుంచీ చేస్తున్న తొండివాదననే వినిపిస్తున్నది. ఒకపక్క మిగులు జలాలే లేవని కేంద్రసంస్థలు చెప్తుంటే ఏపీ మాత్రం మిగులు జలాలనే రాయలసీమకు తరలిస్తామంటూ పాత పాటే పాడింది. మొత్తంగా పీబీ లింక్‌పై ఆది నుంచీ చెబుతున్న కాకిలెక్కలనే మరోసారి ఆ లేఖలో సీడబ్ల్యూసీకి ఏకరువు పెట్టింది.