హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): తీసుకున్న రుణం చెల్లించలేదని రైతు భూమిలో ఫ్లెక్సీ కట్టిన నిజామాబాద్ డీసీసీబీ అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఇతరులకు విక్రయిస్తుండటం వల్లే అలా పెట్టాల్సి వచ్చిందని బ్యాంకు అధికారులు వివరణ ఇవ్వగా, మంత్రి తుమ్మల సీరియస్ అయ్యారు.
ఇలా ఫ్లెక్సీలు పెట్టడాన్ని తమ ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేట్ గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్రెడ్డి 2010లో డీసీసీబీలో రూ.5 లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. కొన్ని వాయిదాలు చెల్లించి ఆపేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు సమాచారమిచ్చినా కట్టకపోవడంతో, ఆయన భూమిలో డీసీసీబీ అధికారులు జెండాలు పాతారు. రుణం తీసుకొని 14 ఏళ్లు కావడం, వడ్డీ పెరిగిపోవడంతో తీసుకున్న రూ.5 లక్షల రుణానికి రూ.15 లక్షల వరకు చెల్లించినట్లు రైతు రాజశేఖర్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తే అసలు కట్టుకుంటానని చెప్పాడు.