హైదరాబాద్, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): సుమారు రూ.64 కోట్లతో షెడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు.. 1,000 మిషన్లు.. 2,000 మందికి ఉపాధి అవకాశాలు.. అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ల ఉత్పత్తి.. ఈ ప్రత్యేకతలతో రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో ప్రముఖ దుస్తుల తయారీ పరిశ్రమ టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (టీఐపీఎల్) ప్రారంభానికి సిద్ధమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి కంపెనీ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
బెంగళూరుకు చెందిన టీఐపీఎల్ సంస్థ సిరిసిల్లలో దుస్తుల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు 2022 ఫిబ్రవరి 25న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. ఆనాటి ప్రభుత్వం ఆ కంపెనీకి సిరిసిల్ల సమీపంలోని పెద్దూరు అప్పారెల్ పార్క్‌లో 7.42 ఎకరాలను కేటాయించింది. 1.77 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్‌ను నెలకొల్పారు. ఒప్పందం ప్రకారం సుమారు రూ.64 కోట్లతో షెడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్తు, నీరు ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది.
కంపెనీ 1,000 మిషన్లతో 2,000 మందికి ఉపాధి కల్పించనున్నది. లోదుస్తులు, టీషర్టుల వంటివి ఇక్కడ తయారవుతాయి. అమెరికాకు చెందిన ప్రముఖ బ్రాండ్లు, రిటెయిలర్లు అయిన కోల్స్, రాబర్ట్ గ్రాహం ఎల్ఎల్సీ, టామీ హిల్ఫిగర్, వ్యాన్స్, వీజీ యూరోప్ బీవీబీ, నాటికా, మైఖేల్ కోర్స్, పైమార్క్ తదితర కంపెనీలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నది. టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్కుకి కేంద్ర ప్రభుత్వం వివేశీ వాణిజ్య విధానం(ఎఫ్టీపీ) కింద ఎక్స్పోర్ట్ హౌస్ సర్టిఫికెట్‌ను కూడా ప్రదానం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే దేశీయ కంపెనీలకు ఈ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తారు.
పెద్దూరు అప్పారెల్ పార్క్‌లో గ్రీన్ నీడిల్ ఫ్యాక్టరీ తర్వాత టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ రెండో అతిపెద్ద దుస్తుల తయారీ కంపెనీ. గ్రీన్ నీడిల్ ఫ్యాక్టరీ అమెరికాలోని న్యూయార్క్‌కు ఆర్గానిక్ కాటన్ బాక్సర్ బ్రీఫ్లను ఎగుమతి చేస్తుండగా, టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ పురుషులు, మహిళలు, పిల్లలకు నిట్టింగ్ ఫ్యాబ్రిక్స్(అల్లిక బట్ట)ను తయారు చేయడంతోపాటు ఎగుమతి చేస్తుంది. దేశీయ మార్కెట్‌కు కూడా అందిస్తుంది. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లో కంపెనీ కార్యకలాపాలు సాగిస్తున్నది. అపెరల్ పార్క్ కోసం నైపుణ్యంగల ఉద్యోగులను తయారుచేసే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు సుమారు 3,000 మందికి శిక్షణ ఇప్పించింది.
ఈ అపెరల్ పార్క్‌లో గోకల్దాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే 500 మంది ఉద్యోగులతో దుస్తుల తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. సమీప భవిష్యత్తులో 1,000 మందికి ఉపాధి కల్పించే దిశగా దీన్ని విస్తరించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంతోపాటు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికుల కోసం అనేక చర్యలు చేపట్టింది.
టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌నకు చెందిన ప్రతినిధులు జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టెక్స్‌పోర్ట్ ప్రతినిధులు పెద్దూరులో రూ.60 కోట్లతో చేపట్టిన దుస్తుల తయారీ యూనిట్ నిర్మాణ పనుల ప్రగతిని వివరించారు. రాష్ట్రంలో చేనేతరంగ సమస్యలు, పరిష్కార మార్గాలపై సచివాలయంలో మంత్రి తుమ్మల సమక్షంలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రతినిధులు రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ను ప్రదర్శించారు.