ఉండవెల్లి, సెప్టెంబర్ 13 : సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో సాగు చేయని భూములకూ పెట్టుబడి సాయం అందించారని, కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం అలా చేయదని స్పష్టంచేశారు.
రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మారుస్తున్నట్టు ప్రకటించారు .అందుకనుగుణంగా మంత్రుల సబ్‌కమిటీ ఏర్పాటు చేసి జిల్లాలో సమావేశాలు నిర్వహించి రైతులు, మేధావుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను స్వీకరిస్తామని చెప్పారు. త్వరలోనే రైతుభరోసా మార్గదర్శకాలు విడుదల చేసి పది ఎకరాల వరకే పెట్టుబడి సాయం నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు.
గత డిసెంబర్లో తమ ప్రభుత్వం వచ్చాక రైతుబంధు నిధులు జమ చేసినట్టు తెలిపారు. అధికారంలోకి రాగానే రైతుబంధు మార్పులకు అవకాశం దొరకలేదని అన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులు బ్యాంకుల ద్వారా రుణాలు పొందినట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రూ.2 లక్షల్లోపు ఉన్న 22 లక్షల మంది కర్షకులకు రుణమాఫీ ఆమలు చేశామని అన్నారు.
తెల్లరేషన్ కార్డు లేని రైతులకు సైతం ఈనెలాఖరులోగా రుణమాఫీ నిధులు జమ చేస్తామని చెప్పారు. రూ.2 లక్షలకుపైగా రుణం తీసుకున్న రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో రూ.2 లక్షలకుపైనున్న లోన్ డబ్బు చెల్లిస్తే మాఫీ వర్తింపజేస్తామని స్పష్టంచేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, అందరికీ వందశాతం మాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.