Rythu Bharosa | హైదరాబాద్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): 15 రోజుల్లో ఇవ్వాల్సిన నివేదిక నాలుగు నెలలైనా పత్తా లేదు. ఎప్పు డు ఇస్తుందో కూడా తెలియదు. అతీ గతీ లేని నివేదికతో రైతుభరోసా పంపిణీకి లింకు పెట్టారు. రైతుభరోసాపై మంత్రుల కమిటీ నివేదిక వచ్చాకే యాసంగి పెట్టుబడిసాయం అందిస్తామని మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు. దీంతో ఆ నివేదిక ఇచ్చేదెప్పుడు.. రైతుభరోసా వచ్చేదెప్పుడు అనే ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. బోడిగుండుకు మోకాలికి లింకు పెట్టినట్టుగా పని చేయని కమిటీకి, పెట్టుబడి సాయం పంపిణీకి లింకు పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వానకాలం రైతుభరోసాకు ఎగనామం పెట్టిన సర్కారు… ఇప్పుడు కమిటీ నివేదిక సాకుతో యాసం గి కూడా రాం రాం పలికే కుట్ర చేస్తుందేమో అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
నివేదిక ఇంకెప్పుడు…?
బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకంలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాలో మార్పుల కోసం జూలై 2న మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబులను భాగస్వామ్యం చేసింది. ఈ కమిటీ రైతుల అభిప్రాయాలు సేకరించి 15 రోజుల్లో నివేదిక అందిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించి రైతుభరోసా విధి విధానాలు ఖరారు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా ప్రకటించారు. ఈ లెక్కన కమిటీ తన నివేదికను జూలై 17వ తేదీ నాటికి ప్రభుత్వానికి అందిజేయాలి. కానీ మరో వారం రోజులైతే కమిటీ ఏర్పాటు చేసి విజయవంతంగా నాలుగు నెలలవుతుంది. ఇప్పటికీ కమిటీ నివేదికకు దిక్కూదివాన లేదు. ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఈ కమిటీ నివేదికపై ఎలాంటి చర్చ జరగడంలేదని తెలిసింది. ఈ కమిటీలోని మంత్రులు కూడా నివేదికకు సంబంధించి ఈ మధ్య కాలంలో సమావేశం కాలేదు.. చర్చించలేదు. అలాంటప్పుడు ఈ కమిటి నివేదిక ఇస్తుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అభిప్రాయాలే సేకరించలేదు
రైతులు, రైతు సంఘాల అభిప్రాయాల పేరుతో ప్రభుత్వం పెద్ద డ్రామాకే తెరతీసింది. ఉమ్మడి జిల్లాల వారీగా తొమ్మిది సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఆ తర్వాత మంత్రులు, ప్రభుత్వం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఉరుకులు పరుగుల మధ్య హడావిడిగా నాలుగు సమావేశాలు నిర్వహించి ఆపేసింది. మిగిలిన ఐదు సమావేశాలకు మంగళం పాడేసింది. ఈ నేపథ్యంలో అసలు కమిటీ చేయాల్సిన అభిప్రాయ సేకరణే పూర్తి కాలేదు. అసెంబ్లీలో రైతుభరోసా అంశంపై కనీస చర్చ కూడా చేయలేదు.
నివేదిక ఇచ్చేదెప్పుడు..
రూ. 2 లక్షల లోపు రైతుల రుణమాఫీని డిసెంబర్లో పూర్తి చేసిన తర్వాత రైతుభరోసా గురించి ఆలోచిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ లెక్కన డిసెంబర్ వరకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందదనేది సుస్పష్టం. ఆ తర్వాత మంత్రుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పంపిణీ చేస్తామని తెలిపారు. అలాంటప్పుడు ఈ కమిటీ భేటీ అయ్యేదెప్పుడు.. నివేదిక ఇచ్చేదెప్పుడు.. రైతులకు రైతుభరోసా ఇచ్చెదెప్పుడు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తయ్యే సరికి యాసంగి కూడా ముగిసిపోతుందని, వానకాలం మాదిరిగానే యాసంగి రైతుభరోసా ఎగనామం ఖాయమనే అభిప్రాయాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.