హైదరాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాకు ఒక వ్యవసాయ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్, నల్లగొండ జిల్లాలోని కంపసాగర్‌లో వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యంలో కనీసం 20 శాతం కూడా చేరుకోని కంపెనీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా గబ్బగుర్తి గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఆయిల్‌పామ్ సీడ్ గార్డెన్ ఏర్పాటును త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.