హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్(ఎంపీహెచ్ఏ-ఫిమేల్) ఉద్యోగులకు ప్రమోషనల్ పోస్టు ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయూఎంహెచ్‌ఈయూ) డిమాండ్ చేసింది. సోమవారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఫసియుద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదనాయక్ మాట్లాడుతూ.. ఎంపీహెచ్ఏ (ఫిమేల్)లకు 6 వారాల ఎల్‌హెచ్‌వీ శిక్షణ పూర్తి చేయలేదనే కారణంతో 12,18 ఏండ్ల నుంచి ఇంక్రిమెంట్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. శిక్షణ తప్పనిసరి అని భావిస్తే వెంటనే ఉమ్మడి జిల్లాకేంద్రాల్లోని పీవో డీటీటీ కార్యాలయాల్లో శిక్షణ ఇచ్చి ఇంక్రిమెంట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.