హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): అమెరికాలో విద్య చాలా వ్యయభరితంగా మారింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజురోజుకు దారుణంగా పడిపోతుండటమే ఇందుకు కారణం. ఈ నెల 18న రూ.79.69గా ఉన్న డాలర్ విలువ 28 నాటికి రూ.81.79కి చేరింది. ఫలితంగా గత 10 రోజుల్లోనే అక్కడ చదువుల ఖర్చు 13 శాతానికిపైగా పెరిగింది. దీంతో ఉన్నత విద్య కోసం తమ పిల్లలను అమెరికా పంపాలని ఎదురుచూస్తున్న ఎంతో మంది భారతీయుల కలలు కల్లలుగానే మిగిలిపోయే పరిస్థితి దాపురించింది. అమెరికాకు వెళ్లే భారత విద్యార్థుల్లో ఎక్కువ మంది స్వదేశం నుంచి తల్లిదండ్రులు పంపే డబ్బులపైనే ఆధారపడుతుంటారు. భారతీయ కరెన్సీని అమెరికాలో డాలర్లుగా మార్చుకొని వినియోగించుకొంటారు.
పేద, మధ్య తరగతి వర్గాల వారైతే విద్యారుణాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్, తాకట్టు రుణాలు (మార్ట్గేజ్ లోన్స్) తీసుకొని పిల్లలను అమెరికాకు పంపిస్తారు. వీరంతా అమెరికాలోని తాజా పరిస్థితులు, జీవన వ్యయంపై ఓ అంచనాకు వచ్చి రుణాలు తీసుకొంటుంటారు. రెండు మూడేండ్ల క్రింత అమెరికా వెళ్లినవారు సైతం ఇదే అంచనాతో బడ్జెట్ వేసుకొని ఉంటారు. కానీ, ఇప్పుడు రూపాయి విలువ పతనం వల్ల చదువుల ఫీజులు, జీవన వ్యయం భారీగా పెరగడంతో వారి అంచనాలన్నీ తల్లకిందులవుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఇప్పటికే ఉన్న అప్పులకు అదనంగా మరింత అప్పు చేయాల్సి వస్తున్నది. లేకపోతే తెలిసినవారి వద్ద చేతులు చాచాల్సి వస్తున్నది.
రూపాయి పతనం వల్ల ఇప్పుడు మన విద్యార్థులు ‘డాలర్ డ్రీమ్స్’ను కట్టిపెట్టి బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల వైపు చూస్తున్నారు. అమెరికన్ డాలర్ కంటే ఈ దేశాల కరెన్సీ చౌకగా ఉండటమే ఇందుకు కారణం. రూపాయితో పోలిస్తే బ్రిటన్ పౌండ్ విలువ గత 12 నెలల్లో 13% క్షీణించింది. అంతేకాకుండా బ్రిటన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత విదేశీ విద్యార్థులకు రెండేండ్లపాటు పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు ఇస్తుండటంతో ఎక్కువ మంది భారత విద్యార్థులు ఆ దేశం వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికాతో పోలిస్తే ఆస్ట్రేలియా, కెనడాలో కూడా చదువుల ఖర్చు తక్కువగా ఉండటంతో మన విద్యార్థులు ఆ దేశాలపైనా దృష్టి సారిస్తున్నారు.
డాలర్‌తో రూపాయి మారకం విలువ నానాటికీ క్షీణిస్తుండటం పేద, మధ్యతరగతి విద్యార్థులకు పెను సమస్యగా మారింది. దీంతో భారత్‌లోని పేద విద్యార్థులు అమెరికా చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉన్నది. మన దేశం నుంచి ఏటా లక్ష మందికిపైగా విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచే 40 వేల మందికిపైగా విద్యార్థులు అమెరికా బాటపడుతున్నారు. ఇలాంటి వారికి మళ్లీ మంచి రోజులు రావాలని ఆశిద్దాం.
– ప్రొఫెసర్ ఆలూరు సుభాష్‌బాబు, విద్యావేత్త