TSTPP | ఆంధ్రప్రదేశ్ పునర్వస్థీకరణ చట్ట ప్రకారం.. పూర్తిగా తెలంగాణ అవసరాల కోసం రామగుండం ఎన్టీపీసీ ఆవరణలో నిర్మించిన టీఎస్టీపీపీ (తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు) ట్రయల్ రన్ విజయవంతమైంది. రాష్ట్ర అవసరాల కోసం కేటాయించిన 4వేల మెగావాట్లలో ఫేజ్-1 కింద రెండు యూనిట్లు (800 మెగావాట్లు+800 మెగావాట్లు) మొత్తం రూ.1600 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించిన విషయం తెలిసిందే.
ఇందులో యూనిట్-1లో చేపట్టిన విద్యుదుత్పత్తి ట్రయల్ సక్సెస్ అయ్యింది. గత జూలైలోనే యూనిట్ లైటప్‌తో ఉత్పత్తి దశలోకి తీసుకురాగా.. విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించి కమర్షియల్ ఆపరేషన్ డిక్లేర్ (COD)గా ప్రకటించడం కోసం ఈ నెల 2 నుంచి 5 వరకు 72గంటలపాటు ఏకదాటిగా 811.4మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసింది. యూనిట్ విద్యుత్ సీవోడీకి అర్హత సాధించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే 800మెగావాట్ల రెండో యూనిట్ అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.