హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, భారీ గాలుల నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో సమస్యలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సూచించారు. గురువారం విద్యుత్తు సరఫరా పరిస్థితిని ఆయన సమీక్షించారు.
భారీ గాలుల ధాటికి చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు, భవన నిర్మాణ సామగ్రి, ఇతర వస్తువులు విద్యుత్తు లైన్లపై పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. విద్యుత్తు సరఫరాలో అత్యవసర సమస్యలు ఉంటే 1912, 100 నంబర్లతోపాటు స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు సర్కిళ్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి, ఫిర్యాదులు చేసే విధంగా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.