నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 5 : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించకుండా జాప్యం చేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం థామస్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సు డిపోల వద్ద ఆందోళన చేపట్టారు. ఉదయం 6 నుంచి 8 వరకు రెండు గంటలపాటు డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 43 వేల మంది ఉద్యోగుల కుటుంబాలతో ముడిపడి ఉన్న బిల్లుకు కీలక సమయంలో గవర్నర్ మోకాలడ్డటంపై వారు మండిపడ్డారు. గవర్నర్ హోదాలో ఉండి కార్మికులకు మేలు చేసే బిల్లు విషయంలో రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బిల్లుకు అడ్డుపడితే సహించేదిలేదని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆర్టీసీ బిల్లును వెంటనే ఆమోదించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. కాగా ఉదయం రెండు గంటలపాటు బస్సుల నడవకపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు.