హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందుకు రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనుమతి లభించిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కన్వీనర్ కోటాలో 30 సీట్లు, యాజమాన్య కోటాలో 20 సీట్లు చొప్పున మొత్తం 50 సీట్లు ఉంటాయని వివరించారు. ఆర్టీసీ సిబ్బందికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు తార్నాక దవాఖానను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. నర్సింగ్ కళాశాల ప్రవేశ వివరాలు, ఇతర సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-68153333, 040-30102829 లేదా www.tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. నర్సింగ్ కళాశాల ముఖ్య వైద్యాధికారి, సూపరింటెండెంట్‌ను నేరుగా సంప్రదించవచ్చునని వెల్లడించారు.