TS RTC | బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేరేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 5,265 బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. 536 సర్వీసుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ సైతం కల్పిస్తున్నట్లు పేర్కొంది. 22న సద్దుల బతుకమ్మ, 23న మహర్నవమి. 24 దసరా పండుగలకు రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉండే అవకాశం ఉండడంతో అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపనున్నది.
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్ర నలుమూలలతో పాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలకు సైతం ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ప్రయాణీలకు రద్దీ అధికంగా ప్రాంతాలకు సైతం ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తామని పేర్కొన్నారు. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచనున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యులర్ స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. అయితే, గతేడాది కన్నా ఈ సారి వెయ్యికపైగా బస్సులను అదనంగా నడుపుతున్నామని, ముందస్తు రిజర్వేషన్ సర్వీసులను సైతం పెంచినట్లు ఆర్టీసీ సజ్జనార్ తెలిపారు.
ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈ మేరకు ఏర్పాట్లు చేశామని, రెగ్యూలర్ సర్వీసుల మాదిరిగానే ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలను వసూలు చేయనున్నట్లు వివరించారు. స్పెషల్ సర్వీసులకు రూపాయి సైతం అదనంగా వసూలు చేయడం లేదన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని.. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా, సురక్షితంగా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటుందని సంస్థ కోరుకుంటుందని సజ్జనార్ పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం tsrtconline.inలో చేసుకోవాలని.. పూర్తి వివరాల కోసం టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.