TSRTC | హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కార్యక్రమంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. రోజు ప్రయాణించే వారి సంఖ్య 13 లక్షల మేర పెరిగింది. అందులోనూ 90 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. ఈ రూపంలో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు రూ.4.50 కోట్లు పెరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. మహిళా ప్రయాణికుల ఉచిత ప్రయాణానికి టికెట్ రేటును ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నందున ఆదాయం పెరుగుతున్నది. గతంలో సాధారణ రోజుల్లో ఆర్టీసీకి నిత్యం రూ.13 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, ఇప్పుడది రూ.18.25 కోట్లకు చేరుతున్నది.
జీరో టికెట్ జారీతో తేలిన లెక్క
బస్సుల్లో సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తే, సోమవారాల్లో 34 లక్షల వరకు ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక, గత సోమవారం 51 లక్షల మంది ప్రయాణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు జీరో టికెట్ల జారీ ప్రకారం ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 43,12,033 మంది ప్రయాణించినట్టు తేలింది.
కొత్త బస్సులు కావాలి..
మహిళల సంఖ్య భారీగా పెరిగినందున బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. స్థలం లేక పురుషులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరిస్థితి అదుపు తప్పకూడదంటే కనీసం 2,500 కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తున్నది.