హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రోడ్డు భద్రతలో కృత్రిమ మేధస్సును వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై తెలంగాణలో రెండు ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్టు ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి లంక తెలిపారు. నిరంతరం డ్రైవర్ కదలికలపై కన్నేసి ఉంచేలా రూపొందించిన ఓ పరికరాన్ని ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. స్టీరింగ్ వద్ద బిగించే ఈ చిన్న పరికరం డ్రైవర్ అప్రమత్తతను అంచనా వేస్తుంది. డ్రైవర్ ఏమాత్రం రెప్పవాల్చినా బీప్ అంటూ శబ్దం చేస్తూ అప్రమత్తం చేస్తుంది. దీనిని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) రూపొందించినట్టు పేర్కొన్నారు. మరో పరికరాన్ని చిప్‌మేకర్ ఇంటెల్, ఐఐటీ హైదరాబాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించినట్టు తెలిపారు. ఈ పరికరాన్ని వాహనం ముందు భాగంలో బిగిస్తారు. అది ముందు వెళ్తున్న వాహనానికి సురక్షిత దూరం ఉండేలా చూస్తుంది. అంతకుమించి సమీపంలోకి వెళ్తే వెంటనే ప్రమాదంపై డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. ఈ పరికరాన్ని రూపొందించడం పూర్తయిందని త్వరలోనే ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని ఆమె చెప్పారు.