TSRTC | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్ర గవర్నర్ పూటకో కొర్రీ పెడుతున్నారు. ఒకవైపు తాను కార్మికుల పక్షపాతినని చెప్పుకొంటూనే మరోవైపు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. సర్కారులో ఆర్టీసీ విలీనం బిల్లును అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణికి దిగిన గవర్నర్.. కార్మికుల రాజ్‌భవన్ ముట్టడితో కొంతవరకు దిగివచ్చారు. విలీనం విషయంలో ప్రభుత్వం నుంచి ఐదు అంశాలపై వివరణ కోరానని, అవి రాగానే బిల్లుపై సంతకం చేస్తానని కార్మిక నేతలతో చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి ఆ ఐదు అంశాలపై సమగ్ర వివరణ వచ్చినప్పటికీ.. వాటిపై సంతృప్తి చెందని గవర్నర్.. ఇవి చాలదంటూ.. మరో ఆరు సందేహాలను లేవనెత్తారు. దీంతో బిల్లు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బీజేపీ నేతల డైరెక్షన్లోనే గవర్నర్ ఉద్దేశపూర్వకంగా పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని కార్మిక వర్గాలు భావిస్తున్నాయి. గవర్నర్ ఏ అర్ధరాత్రి బిల్లుకు ఆమోదం తెలిపినా.. ఆదివారం ఉదయమే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలుపుతారా లేక అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు జాప్యం చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఉదయం రెండు గంటలపాటు బస్సులను నిలిపివేసి డిపోల ముందు నిరసన తెలిపిన కార్మికులు, ఆ తరువాత రాజ్‌భవన్‌ను ముట్టడించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డుకు చేరుకున్న కార్మికులు.. నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో ర్యాలీగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గేటు ముందు కూర్చుని గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వెంటనే ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్ ఆమోదించిన ఆర్టీసీ విలీనం ముసాయిదాను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని కోరారు. ఈ ఆందోళనతో దిగివచ్చిన రాజ్‌భవన్ కార్యాలయ వర్గాలు కార్మికులను చర్చలకు పిలిచాయి. పుదుచ్చేరి పర్యటనలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక నాయకులతో మాట్లాడారు.
తాను ఎప్పుడూ కార్మికుల పక్షపాతినేనంటూ ఇటు కార్మిక నేతలతో, అటు ట్విట్టర్ వేదికగా చెప్పుకొన్న గవర్నర్ తమిళిసై నిజానికి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. ఇందుకు గవర్నర్ వ్యవహరించిన తీరును వారు ఎత్తి చూపుతున్నారు. రాజ్‌భవన్‌ను ముట్టడించిన కార్మికుల ఆందోళనతో దిగివచ్చిన గవర్నర్.. కార్మిక నేతలతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఐదు అంశాలపై ప్రభుత్వాన్ని తాను వివరణలు కోరానని, వాటిని బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఐదు అంశాలపై స్పష్టమైన వివరణలు రాజ్‌భవన్‌కు చేరాయి. కానీ ఇంతలోనే రాజ్‌భవన్ మరో కొత్త కొర్రీ వేసింది. మరిన్ని సందేహాలున్నాయని, వాటికి కూడా వివరణ ఇవ్వాలని శనివారం రాత్రి రాజ్‌భవన్ మరో లేఖను ప్రభుత్వానికి పంపింది.
బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు శనివారమే గవర్నర్ నుంచి అనుమతి వస్తుందని భావించారు. రాజ్‌భవన్ లేవనెత్తిన ఐదు అంశాలకు ప్రభుత్వం సంతృప్తికరంగా, స్పష్టంగా వివరణ ఇచ్చింది. ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఇక గవర్నర్ అనుమతిస్తారని ఆర్టీసీ కార్మికులు ఆశిస్తున్నంతలోనే.. రాజ్‌భవన్ మరో కొర్రీ వేసింది. ‘మీరు (ప్రభుత్వం) ఇచ్చిన వివరణలు సరిపోలేదు.. ఆర్టీసీ కార్మికులతో మాట్లాడిన తరువాత మరికొన్ని సందేహాలున్నాయి. వీటికి కూడా వివరణలు ఇవ్వండి’ అంటూ శనివారం రాత్రి మరో వర్తమానం పంపింది. అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఒక పక్క 43 వేల మందికిపైగా కార్మిక కుటుంబాలు కండ్లల్లో వత్తులు వేసుకుని.. బిల్లు పాస్ అయితే.. తాము ప్రభుత్వ ఉద్యోగులం అయిపోతామని, దశాబ్దాలుగా పేరుకుపోయిన తమ కష్టాలు, కన్నీళ్లు శాశ్వతంగా తీరుతాయని.. తమ భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో ఉండగా.. రాజ్‌భవన్ మాత్రం కొర్రీలపై కొర్రీలు వేస్తూ.. కాలయాపన చేయడమే పరమావధిగా.. వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నది.
ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో శనివారం ఉదయం రెండు గంటలపాటు ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఉదయం 6 గంటలకే డిపోలకు చేరుకున్న ఉద్యోగులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హైదరాబాద్, చుట్టుపక్కల డిపోల నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు సచివాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రదర్శనగా రాజ్‌భవన్ వెళ్లారు. ఇదిలా ఉండగా.. ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ బాపు శనివారం మధ్యాహ్నం వరకు ధర్నా, నిరసనల్లో పాల్గొని సాయంత్రానికి గుండెపోటుతో మృతి చెందడంతో ఆర్టీసీ కార్మికుల్లో బాధ, దుఃఖంతోపాటు రాజ్‌భవన్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తమయ్యింది.
ఆర్టీసీ కార్మిక నేతలతో చర్చలు జరిపిన గవర్నర్ ఆ తరువాత బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అశ్వత్థామరెడ్డితో చర్చించడంపై కార్మికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పార్టీ ప్రతినిధితో కార్మికుల సమస్యలపై చర్చించడాన్ని టీఎంయూ నేత థామస్‌రెడ్డి తప్పుపట్టారు. ఆర్టీసీ కార్మికులు వేతనాల పెంపు కోసం చేపట్టిన సమ్మె నుంచి అశ్వత్థామరెడ్డి అర్ధంతరంగా తప్పుకొని, డబ్బులకు కక్కుర్తి పడి కార్మికులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వత్థామరెడ్డి ఇచ్చిన తప్పుడు సలహాలతో ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేయవద్దని గవర్నర్‌ను కోరారు. గవర్నర్ బీజేపీ నాయకురాలిగా వ్యవహరించవద్దని, రాజకీయాల కోసం 43 వేల మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందే అవకాశాన్ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ నుంచి ఏ అర్ధరాత్రి అనుమతి వచ్చినా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమయ్యింది. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి, సంబంధిత అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ గవర్నర్ శనివారం రాత్రి అనుమతిస్తే ఉదయంకల్లా బిల్లులను సిద్ధం చేసి సభలో పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే గవర్నర్‌కు అనుమతి ఇచ్చే ఉద్దేశం ఉన్నదా.. లేదా అన్న చర్చ ఆర్టీసీ కార్మిక వర్గాల్లో జరుగుతున్నది. గవర్నర్ అనుమతి ఇవ్వకపోతే తాము పూర్తిస్థాయి కార్యాచరణను ప్రకటిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని తమను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు బిల్లు తీసుకురాగా, గవర్నర్ కొన్ని అంశాలపై స్పష్టత కోసం బిల్లును హోల్డ్‌లో ఉంచారు. మరికొన్ని గంటల్లో 43 వేల మంది కార్మికుల కల నెరవేరుతుందనగా, గవర్నర్ నిర్ణయంతో మా ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. అన్ని సంఘాలతో కలిసి ఐదు వేల మందికిపైగా న్యాయం కోసం గవర్నర్ వద్దకు వచ్చాం. అశేష కార్మికులను చూసి ఆమె నిర్ణయాన్ని మారుకొని మాతో చర్చలు జరిపారు. త్వరలో బిల్లుపై సంతకం చేస్తానని చెప్పారు. నాడు ఓ నేత కార్మికులను రెచ్చగొట్టి పారిపోగా, 33 మంది కార్మికులు చనిపోయారు. అలాంటి వారిని నేడు కార్మికులు నమ్మరు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలబడింది, అందుకే వేలాదిగా తరలివచ్చారు.
– థామస్‌రెడ్డి, టీఎంయూ ప్రధానకార్యదర్శి
ఆర్టీసీని సర్కారులో విలీనం చేస్తూ సిద్ధం చేసిన ముసాయిదా బిల్లుపై రాజ్‌భవన్ నుంచి ఐదు అంశాలపై వివరణ కోరుతూ వచ్చిన లేఖకు.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత అంశాలపై స్పష్టమైన వివరణ ఇస్తూ రాజ్‌భవన్‌లోని గవర్నర్ కార్యదర్శికి లేఖ రాశారు. ఆ వివరాలు అంశాల వారీగా ఇలా ఉన్నాయి..