హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా రెండేండ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న బాజిరెడ్డి గోవర్ధన్‌కి సంస్థ ఉన్నతాధికారులు ఆత్మీయవీడోలు పలికారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్-వినోద దంపతులను ఘనంగా సన్మానించారు. చైర్మన్‌గా సంస్థకు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన కాలాన్ని మరిచిపోలేనని చెప్పారు. తన పదవీకాలంలోనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ఎంతో సంతోషంగా ఉన్నదని తెలిపారు.
విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన సంస్థ ఎండీ సజ్జనార్‌తోపాటు అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. సజ్జనార్ మాట్లాడుతూ.. గత రెండేండ్లలో దాదాపు రూ.1,600 కోట్ల నష్టాన్ని తగ్గించామని చెప్పారు. సంస్థ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిషరించడంలో బాజిరెడ్డి కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీవోవో డాక్టర్ వీ రవీందర్, జేడీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్, ఈడీలు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్‌కుమార్, కృష్ణకాంత్, నిజామాబాద్ ఏడీఏ చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగారాం, బాజిరెడ్డి కుటుంబసభ్యులతోపాటు సంస్థ హెచ్వోడీలు, ఆర్ఎంలు, పాల్గొన్నారు.