TSREDCO Satish Reddy | రాష్ట్రం ఏర్పడకముందు పదేండ్ల కాలానికి, ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పదేండ్లలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ పార్టీ నేతలకు రెడ్కో చైర్మన్ వై సతీష్‌రెడ్డి సవాల్ విసిరారు. దమ్ములేని రేవంత్‌రెడ్డి ధరణిని ఎత్తేస్తామంటూ తెలివి తక్కువ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరును వాపును చూసి బలుపు అనుకున్నట్టే ఉందని ఆరోపించారు.
పీసీసీ అధ్యక్షుడు తనను తాను ఎకువగా ఊహించుకుంటున్నారని వై సతీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాముల పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పేరునే సాంగ్రెస్గా మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వంలోనే కాక పార్టీలోనూ అవినీతికి పాల్పడ్డ చరిత్ర ఆ పార్టీదని శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రూ. 50 కోట్లు ఖర్చుపెట్టి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడని కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
పార్టీలోనే అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న నేతలకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ప్రజలను ఏ స్థాయిలో దోచుకుంటారోననే విషయం ప్రజలకు తెలిసే కాంగ్రెస్ పార్టీని దూరంపెడుతున్నారని సతీశ్‌రెడ్డి చెప్పారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను కాంగ్రెస్ హయాంలో ఎందుకు తేలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడకముందు పదేండ్ల కాలానికి, ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.
వాస్తవాలను ఒప్పుకునే దమ్ములేని రేవంత్‌రెడ్డి ధరణిని ఎత్తేస్తామంటూ తెలివి తక్కువ వ్యాఖ్యలు చేశారని సతీశ్ రెడ్డి దుయ్యబట్టారు. ధరణిని ఎత్తేసి మళ్ళీ దళారీ వ్యవస్థను తెచ్చి తద్వారా రైతులకు భూ సమస్యలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నదే రేవంత్ ఆలోచన అని ఆరోపించారు. ధరణిని రద్దుచేసి రాష్ట్ర రైతాంగానికి రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను దూరం చేసేందుకు రేవంత్ కంకణం కట్టుకున్నారని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేషాలు వేసినా రైతులు ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లోలేరని ఆయన స్పష్టం చేశారు.