హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడం..ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలతచెందిన ఆమె శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి, సభ్యులు బండి లింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డిలు రాజీనామాలు సమర్పించగా, ఇటీవలే వీరి రాజీనామాలను ఇటీవలే గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకొని, తన సిబ్బంది ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపించారు. ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. సుమిత్ర వృత్తిరీత్యా ప్రభు త్వ టీచర్. అయినా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉద్య మిం చారు. తెలంగాణ యాస పరిరక్షణకు తెలంగాణ భాషా వేదికను ఏర్పాటు చేశారు. అక్షరాస్యత, సారా నిషేధం, మద్యపాన వ్యతిరేకోద్యమం, బాల్య వివాహాలను అరికట్టేందుకు అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆమె పూర్తి పదవీకాలం ఆరేండ్లు కాగా, రెండున్నరేండ్లకే సుమిత్ర కమిషన్ సభ్యురాలి రాజీనామా చేశారు. తనను గుర్తించి ఈ అవకాశం కల్పించిన మాజీ సీఎం కేసీఆర్‌కు సుమిత్ర కృతజ్ఞతలు తెలిపారు.