హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ)/మల్యాల: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం కేసు బేగంబజార్ పోలీస్‌స్టేషన్ నుంచి సీసీఎస్ నేతృత్వంలోని సిట్‌కు బదిలీ అయ్యింది. నగర అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్) ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని సిట్ బుధవారం తిరిగి కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సిట్ బృందం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. కస్టోడియన్ సెక్షన్ అధికారితో మాట్లాడి ఆమె స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. సైబర్ నిపుణులతో కలిసి కంప్యూటర్లను పరిశీలించారు. ప్రవీణ్‌కుమార్ ఎక్కడి నుంచి సిస్టమ్ ఆన్ చేశాడనే అంశాలను తెలుసుకున్నారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డి డైనమిక్ ఐపీకి బదులుగా స్టాటిక్ ఐపీని వాడినట్టు తేలడంతో దానిపై ఆరా తీశారు.
సిస్టమ్ నెట్వర్క్, కంప్యూటర్ల ఆపరేటింగ్ వంటి విషయాలపై ఫోరెన్సిక్ టూల్స్‌తో కంప్యూటర్లను పరిశీలించారు. ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా తదుపరి విచారణ చేయనున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ఫోన్లను, బ్యాంక్ స్టేట్మెంట్లను పోలీసులు పరిశీలించారు. ప్రవీణ్ తన బంధువు ఒకరికి రూ.3.5 లక్షలు పంపించినట్టు ఆధారాలు దొరికాయి. ఇతడికి పలువురు మహిళలతో పరిచయాలు ఉండటంతోపాటు అతడి సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు, వీడియోలు కూడా లభించాయి. వాళ్లు ఎవరు, ప్రవీణ్‌కు ఎలా పరిచయం అయ్యారనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. వీటితోపాటు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, ఇతరులకు సంబంధించిన ఫోన్‌కాల్ డాటా, వాట్సాప్ చాటింగ్‌లను పోలీసులు వెతుకుతున్నారు.
ఇటీవలే తాటిపల్లి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి
పేపర్ లీకేజీలో కేసులో నిందితుడైన అట్ల రాజశేఖర్‌రెడ్డి అరెస్టు అతడి స్వగ్రా మం జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో కలకలం రేపింది. కుటుంబంతోసహా రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లోనే స్థిరపడినప్పటికీ ఈ నెల 7న తాటిపల్లికి వరలక్ష్మి వ్రతం కోసం వచ్చాడు. నాలుగు రోజులు అక్కడే ఉన్నాడు. లీకేజీకి సంబంధించి దరఖాస్తుదారులను ఎవరినైనా రాజశేఖర్‌రెడ్డి కలిశాడా..? కలిస్తే ఏం మాట్లాడాడనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. రాజశేఖర్ తల్లి వసంత గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త. తండ్రి అంజిరెడ్డి వ్యవసాయం చేస్తున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించినట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకైన ఘటనపై నిరసన పేరుతో కొందరు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా కమిషన్ కార్యాలయం పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.