TS Weather Update | రాగల ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కొముర్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. సోమవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, మరికొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం నుంచి జూన్ 3 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని, పలుచోట్ల ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేటలో వర్షం పడింది.