TS Weather | హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో రాగల రెండురోజులు వడగాలులు వచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఎండల తీవ్రత సైతం రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఎండలు 43డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎల్లుండి తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది.
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. 9న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఇదిలా ఉండగా.. శుక్రవారం నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్‌లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ వివరించింది.