హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాలను తెలంగాణ, ఏపీకి సమానంగా పంచే అధికారం తమకు లేదని.. నీటి వాటాల పంపకాన్ని చేపట్టబోమని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్-2 ఎదుట ఏపీ పిటిషన్ దాఖలు చేయడం.. దానికి తెలంగాణ కౌంటర్ వేయడంతో ఈ అంశంపై శుక్రవారం ఢిల్లీలో విచారణ కొనసాగింది. కృష్ణా జలాల కేటాయింపులో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పూర్తిగా అక్రమంగా వ్యవహరించిందని, ఏపీకి చెందిన ప్రాజెక్టులకే మొదటి ప్రాధాన్యమిచ్చి మొత్తం 512 టీఎంసీల్లో 300 టీఎంసీలను బేసిన్ అవతలికి తీసుకుపోయే ప్రాజెక్టులకే కేటాయించిందని తెలంగాణ తీవ్రంగా ఆక్షేపించింది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2013లో ఉమ్మడి ప్రభుత్వమే అనుమతులిచ్చిందని, దానినే 2015లో తెలంగాణ చేపట్టిందని పేర్కొన్నది. నీటిని తీసుకునే ప్రాంతం, ఆయకట్టు మినహా ఉమ్మడి ఏపీ చేసిన ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టిందని వివరించింది. 2015లోనే చేపట్టిన ఈ పనులపై ఏండ్లు గడచిన తర్వాత ఇప్పుడు అభ్యంతరాలు తెలుపడమేంటని తెలంగాణ నిలదీసింది. అపెక్స్ కౌన్సిల్ అత్యున్నత బోర్డుగా వ్యవహరిస్తున్నందున దీనిపై ట్రిబ్యునల్‌లో విచారణ జరపడం సమంజసం కాదని పేర్కొన్నది. ఈ వాదనలను ఏపీ ఖండించింది. ఈ అంశంపై జూలై 12, 13, 14న విచారణ జరుపనున్నట్టు ట్రిబ్యునల్ చైర్మన్ ప్రకటించారు.
సగం నీళ్లు ఇవ్వాల్సిందే
కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా ఇవ్వాల్సిందేనని రాష్ట్రం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెగేసి చెప్పింది. కేఆర్ఎంబీ 17వ సమావేశ మినిట్స్‌ను బోర్డు విడుదల చేసింది. రాష్ర్టాల అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా నీటి పంపకాలు జరిపే అధికారం బోర్డుకు లేదని రాష్ట్ర నీటి పారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్ పట్టుబట్టారు. వాదనలతో బోర్డు చైర్మన్ ఏకీభవిస్తూ.. నీటి పంపకాల అంశాన్ని కేంద్రానికి సిఫారసు చేస్తామని వెల్లడించారు. కృష్ణా జలాల వినియోగం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని స్పష్టం చేశారు.