Special Education Teachers | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారు మరో మానవీయ నిర్ణయం తీసుకొన్నది. బుద్ధిమాంద్యత, ఆటిజం, మాస్క్యూలర్ డిస్ట్రోఫీవంటి పలు రకాలైన వైకల్యాలతో బాధపడుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని నిర్ణయించింది. శాశ్వత ప్రాతిపదికన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమించేందుకు పచ్చజెండా ఊపింది. పది మంది విద్యార్థులకు ఒకరు చొప్పున మొత్తంగా 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ టీచర్ పోస్టులను కొత్తగా మంజూరు చేయడమే కాకుండా ఆయా పోస్టుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఆర్థికశాఖ జీవో నెంబర్-125ను జారీచేసింది. వీటిలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 798, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 727 టీచర్ పోస్టులు ఉన్నాయి.
ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ పే స్కేల్ రూ. 31,040 -92,050, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ టీచర్ పేస్కేల్ రూ.42,300 -1,15,270గా ఖరారు చేసింది. విద్యాశాఖ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30వేల వరకు ప్రత్యేకావసరాలు గల చిన్నారులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో 10,900 మంది ప్రాథమిక పాఠశాలల్లో, మరో 18,857 మంది ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. కొత్తగా మంజూరు చేసిన 1,523 మంది టీచర్ల ద్వారా ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు వారి అవసరాల మేరకు విద్యాబోధన చేయనున్నారు.
ఇప్పటివరకూ కాంట్రాక్టే..
దివ్యాంగులు, ఇతర వైకల్యాలతో బాధపడేవారికి రెగ్యులర్ టీచర్లు బోధించే పాఠాలు సరిపోవు. వీరికి సుశిక్షితులైన టీచర్లే బోధించాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. 10 మంది విద్యార్థులుంటే ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ద్వారా మండలానికి ఒకటి చొప్పున భవిత సెంటర్లను నిర్వహిస్తున్నది. వీటిలో 970 టీచర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొన్న తాజా నిర్ణయంతో ఇక నుంచి ప్రత్యేకావసరాలు గల చిన్నారులకు స్పెషల్ టీచర్లను నియమించి బోధిస్తారు. ఈ పోస్టులకు బీఈడీ (స్పెషల్) పూర్తి చేసిన వారే అర్హులు. డీఎస్సీ కోసం శుక్రవారం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలుపగా, శనివారం 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి ఆర్థికశాఖ గ్రీన్సిగ్నల్నిచ్చింది. మొత్తంగా 6,612 పోస్టుల భర్తీకి లైన్‌క్లియర్ అయ్యింది. దీంతో అతి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
జిల్లాలవారీగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ టీచర్ పోస్టుల వివరాలు