హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): పోలీసు ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆధ్వర్యంలో నిర్వహించిన తుది పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెల 14 నుంచి 26వ తేదీ వరకు చేపట్టనున్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 సెంటర్లను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. ఇంటిమేషన్ లెటర్‌ను అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఆ లెటర్‌ను చూపించాలని సూచించారు.
ఇంటిమేషన్ లెటర్ జూన్ 11న ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. 18 సెంటర్లలో మొత్తం 1,09,906 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనున్నది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రంలోనే అప్లికేషన్ ఎడిటింగ్/మాడిఫై చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా మార్కుల వెయిటేజీ పొందాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్టీఏ ధ్రువీకరించిన సర్టిఫికెట్లను చూపించాలని తెలిపారు. వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులు కుల ధ్రువీకరణ, బీసీ అభ్యర్థులు నాన్ క్రీమిలేయర్, ఈడబ్ల్యూఎస్, ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు ఒరిజినల్స్, జిరాక్స్‌ల సెట్ తప్పనిసరిగా తీసుకొనిరావాలని స్పష్టంచేశారు. వీటితోపాటుగా ఇంటిమేషన్ లెటర్, ట్రాన్సాక్షన్ ఫాం, పార్ట్-2 అప్లికేషన్ ప్రింట్ అవుట్, ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, వయసు, లోకల్, రిజర్వేషన్, ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, హారిజంటల్ రిజర్వేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.