జగిత్యాల, జనవరి 24 : రానున్న రోజుల్లో బీజేపీతో దళితులకు పెనుప్రమాదం పొంచి ఉన్నదని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. అంబేదర్వాదులు తక్షణమే ఆ పార్టీని వీడాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివసాయి హోటల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనువాద భావజాలాన్ని అవలంబిస్తూ దళిత అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న బీజేపీని ఎండగట్టాలని సూచించారు. రాష్ట్రంలోని దళితులు, మేధావులు, అంబేదర్వాదులు, కవులు, కళాకారులు, సామాజిక వాదులు, ప్రజాస్వామికవాదులు ఈ విషయాన్ని గుర్తించి బీజేపీని భూస్థాపితం చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ వ్యాప్తికోసం ఆ పార్టీ అనేక కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు.