TS Minister Harish Rao | రైతుల జీవితాలతో ఆడుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కరంట్ విషయమై తప్పు మీద తప్పు చేస్తున్నదని అన్నారు. హరీశ్ రావు సమక్షంలో ఆదివారం పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఒక మూఠా చేతులోకి వెళ్లిందన్నారు. తన స్వార్థం కోసం రాజకీయ పార్టీలు మారిన నాయకుడు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవిని కాపాడుకోవడానికి పాకులాడాడే తప్ప, రాజీనామా చేసేందుకు ముందుకు రాలేదన్నారు. ఉద్యమ కారులపై తుపాకీ ఎక్కుపెట్టిండని చెప్పారు. రైతు బంధు ఇచ్చి రైతులను బిచ్చగాళ్లను చేసిండంటున్న రేవంత్ రెడ్డికి అన్నదాతలు బిచ్చగాళ్లుగా కనిపిస్తున్నరా? అని మండి పడ్డారు.
సీఎం కేసీఆర్ పట్ల రేవంత్ రెడ్డి దుర్మార్గమైన భాష ఉపయోగిస్తున్నాడని హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ సాధించిన మన సీఎం కేసీఆర్కు.. రేవంత్ రెడ్డికి పొంతన ఉందా ? అని ప్రశ్నించారు. లంబాడీలకు క్వార్టర్ ఇస్తే ఓట్లేస్తరని మాట్లాడిన రేవంత్.. ఓయూ విద్యార్థి నాయకులను ఘోరంగా అవహేళన చేసి మాట్లాడారన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో కరంట్ ,తాగునీటికి డోకా లేదని హరీశ్ రావు చెప్పారు. కర్ణాటకలో రెండు గంటల కరంట్ కూడా ఇస్తలేరన్నారు. కర్ణాటకలో ఎటు చూసినా కరువే కనిపిస్తున్నదని అన్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర వడ్ల నమూనా మనకెందుకని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది..? మన రాష్ట్రంలో ఎలా ఉంది ? అన్న విషయాలు పరిశీలించాలన్నారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు అంటున్న రేవంత్ రెడ్డికి వ్యవసాయం తెలుసా? అని హరీశ్ రావు నిలదీశారు. అసలు హార్స్ పవర్ అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతును రాజును చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భూముల విలువ పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ అంటే నమ్మకం.. ప్రజలకు ఒక భరోసా అని చెప్పారు.
‘రాష్ట్రానికి కావాల్సింది బూతులు మాట్లాడే నేతలు కాదు.. మంచి భవిష్యత్ ఇచ్చే నేతలు కావాలి. పల్లెల్లో కరవు లేదు హైదరాబాద్ లో కర్ఫ్యూ లేదు. సమ్రుద్ధిగా వడ్లు పండుతున్నాయి. పంజాబ్ రాష్ట్రాన్ని మించి తెలంగాణ వరి ధాన్యం పండిస్తోంది. ములుగులో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం’ అని హరీశ్ రావు చెప్పారు.