TS Minister Errabelli | అభివృద్ధి చెందిన కొన్ని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు అలా వచ్చి ఇలా వెళ్లిపోతూ ఉంటారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. అలా అభివృద్ధి చెందిన పాలకుర్తికి కొత్తగా వచ్చేవారు కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోతారని వారిని పెద్దగా పట్టించుకోనవసరం లేదన్నారు. అలా వచ్చిన వారిలో కొందరు కంటికి కనపడకుండా పోయారన్నారు. ఇక ముందు అలా వచ్చే వారికి అలాంటి పరిస్థితే వస్తుందన్నారు.
మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో తొర్రూరులో ఉపాధి హామీ కూలీలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లంచ్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఇన్ని రోజులుగా ఎవరూ పట్టించుకోని పాలకుర్తిని తాను ఎమ్మెల్యే అయ్యాక అన్ని రకాలుగా అభివృద్ధి చేశానన్నారు.
నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసే నాయకులనే ప్రజలు ఆదరించి గౌరవిస్తారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తాను తొలిసారి ఎన్నికల్లో ఓడిపోయానని ఆ తర్వాత దాన్ని గుణపాఠంగా తీసుకొని ప్రజల్లోనే ఉంటూ నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యాయనని అన్నారు. తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేయడం వల్లే తాను ఓటమెరగకుండా గెలుస్తూ వస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

ఎన్నికల సీజన్ వచ్చేసరికి ఏవేవో ఆశలతో ఈ మధ్య కొందరు నియోజకవర్గానికి వస్తున్నారని అలాంటి వారి ఆశలను ప్రజలు అడియాసలు చేస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ప్రజల ఆదరణ ఉన్నంతకాలం తననెవరు ఏమీ చేయలేరన్నారు. తనతోపాటు తన కుటుంబం ప్రజా జీవితానికి అంకితమయ్యామని చెప్పారు. ప్రజల మేలు కోసం పనిచేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రభుత్వ అభివృద్ధితోపాటు ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలోనూ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, అవన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
గతంలో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఆ నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ వైద్య సేవా కార్యక్రమాలు చేపట్టానని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం నిర్మాణానికి నిధులు సేకరించినట్లు చెప్పారు. ఎంజీఎం వైద్యశాల అభివృద్ధి కోసం నిధులు సేకరించి కృషి చేశానని మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గమంతా మంచినీటి ప్లాంట్లు
ఏర్పాటు చేసి, ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం లోని 79 వేల మంది ఉపాధి హామీ కూలీలకు మంత్రి ఎర్రబెల్లి లంచ్ కిట్లు పంపిణీ చేశారు. మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా వేదికపై మంత్రి ఎర్రబెల్లి కేక్ కట్ చేసి, అందరికీ పంచారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆ లంచ్ కిట్లో టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్, ఒక బ్యాగ్, సెల్ ఫోన్ పెట్టుకోడానికి పాకెట్ వంటి వసతులతో కూడిన కిట్లు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం దేవరుప్పుల, తొర్రూరు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. త్వరలోనే ప్రతి ఇంటింటికి ఈ టిఫిన్ బాక్సులు అందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. తన బిడ్డా కొడుకు స్నేహితుల ద్వారా నిధులను సమీకరిస్తూ ప్రజలకు పంచుతున్నానన్నారు.
యువత డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఒక్కొక్కరూ రూ.5000 చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ పరిస్థితుల నుంచి యువతను ఆదుకునేందుకు అతి తక్కువ ఖర్చుతో అర్హులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. ఇప్పటి వరకు 8,500 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 12 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని, వారందరికీ డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్స్ పొందిన యువతకు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సులను మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు.