హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి తరలివచ్చే కంపెనీల సంఖ్య ఏటికేడు పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది రాష్ట్రంలో 2,261 పరిశ్రమలకు టీఎస్ఐపాస్ ద్వారా అనుమతులు మంజూరయ్యాయి. వీటి ద్వారా రూ.17,536 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2022 డిసెంబర్ వరకు మొత్తం 21,864 పరిశ్రమలకు అనుమతులు జారీ కాగా, రూ.2,50,887 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 17.18 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
ఈ మేరకు బుధవారం గణాంకాల శాఖ పెట్టుబడుల వివరాలను వెల్లడించింది. తెలంగాణ అనేక రంగాల్లో తయారీ పరిశ్రమలకు కేంద్రంగా మారిందని, బల్క్ డ్రగ్స్, ఔషధాలు, ఆగ్రో-ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమ, ఖనిజాల ఆధారిత పరిశ్రమలు ప్రముఖమైనవని నివేదిక తెలిపింది. ఇంజినీరింగ్, వస్త్ర పరిశ్రమ, కాటన్ జిన్నింగ్, తోళ్ల పరిశ్రమ, సుగంధ ద్రవ్యాలు, ఉద్యానవనాలు, పౌల్ట్రీ, బయో టెక్నాలజీ, విద్యుత్తు ఉపకరణాలు, రబ్బర్, ప్లాస్టిక్, పప్పు మిల్లులు, పేపర్, పేపర్ ఉత్పత్తులు, బేవరేజెస్, రక్షణ రంగ పరికరాలు తదితర ఉత్పత్తులు కూడా భారీస్థాయిలో కొనసాగుతున్నాయని వివరించింది.
టీఎస్ఐపాస్తో పెట్టుబడుల వెల్లువ
2014 డిసెంబర్లో ప్రభుత్వం టీఎస్ఐపాస్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం వచ్చాక 2022 డిసెంబర్ వరకు మొత్తం 21,864 పరిశ్రమలకు అనుమతులు జారీ చేశారు. వీటి ద్వారా రూ.2,50,887 కోట్ల పెట్టుబడులు సమకూరగా, 17.18 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ వివిధ రంగాల్లో తెలంగాణను నెంబర్ 1గా నిలిపే సంకల్పంతో పెట్టుబడుల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. దేశ, విదేశీ ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటయ్యేలా ప్రయత్నిస్తున్నారు. దీంతో తెలంగాణ దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది.
ఉద్యమ్లో 2,97,724 ఎంఎస్ఎంఈలు నమోదు
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) మంత్రిత్వశాఖ 2020లో ఎంఎస్ఎంఈల నమోదుకు ఉద్యమ్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. కేంద్రం కల్పిస్తున్న రాయితీలు, ఇతర సౌకర్యాలు పొందేందుకు ఈ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి. ఇందులో రాష్ట్రం నుంచి 2,97,724 యూనిట్లు నమోదయ్యాయి. వీటిల్లో 39,51,941 మందికి ఉపాధి లభిస్తున్నది. ఎంఎస్ఎంఈల్లో హైదరాబాద్ జిల్లా 65,114 యూనిట్లతో రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నది.