TS Gurukulam Posts | గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి 23 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (TREIRB) గురువారం ప్రకటించింది. అభ్యర్థులకు పోస్టులవారీగా కంప్యూటర్ అధారిత పరీక్ష (CBT)ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి మొత్తంగా తొమ్మిది కేటగిరీల్లో తొలి విడతలో 9,210 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ బాధ్యతను రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించింది. అందులో భాగంగా పీజీటీ 1276, టీజీటీ 4020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టుల భర్తీకి ట్రిబ్ తొలుత చర్యలు చేపట్టింది. గత నెల 27 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగగా, అన్ని పోస్టులకు కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చినట్లు ట్రిబ్ వెల్లడించింది. పోస్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ రెండు రోజుల్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఒక ప్రకటనలో తెలిపింది.