హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తమిళిసై సౌందర్‌రాజన్.. రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత. కానీ.. తన ప్రభుత్వంపై తానే విమర్శిస్తారు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయాల గురించి మాట్లాడతారు. తన విధులకు, బాధ్యతలకు పెద్దగా సంబంధం లేని అంశాలపై వ్యాఖ్యానాలు చేస్తారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై తాను బాధ్యతలు తీసుకొని మూడేండ్లు పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ఆరోపణలుచేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాలను ప్రభుత్వం ఏడాదిపాటు నిర్వహిస్తుంటే.. తాను ప్రత్యేకంగా విమోచన దినోత్సవం జరుపుతానని ప్రకటించారు. ప్రభుత్వమే తనది. ప్రభుత్వం చేసే ప్రతి పనీ.. తాను చేసినట్టే.. రాజ్‌భవన్ విడిగా కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటి? పైగా తాను తెలంగాణ చరిత్ర చదువుకొన్నానని, సెప్టెంబర్ 17 విమోచనమేనని తనదైన నిర్వచనం కూడా చెప్పారు. విమోచనమా? మరేదైనానా? అన్నది చెప్పాల్సిన బాధ్యత గవర్నర్‌కు ఏమున్నదని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులను విమర్శించినట్టు తనను సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని గవర్నర్ వ్యాఖ్యానించారు.
రాజ్‌భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారని, మహిళాదర్బార్ నిర్వహించానని గవర్నర్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చి.. బీజేపీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ.. వారితో తిరుగుతూ.. అత్యున్నత రాజ్యాంగ పదవిని చిన్నచేసిన గవర్నర్‌పై విమర్శలు రావడం సహజం. గవర్నర్ పదవికి వన్నె తెచ్చే విధంగా వ్యవహరిస్తే ఎవరు మాత్రం ఎందుకు విమర్శిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గవర్నర్లు దర్బార్లు నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ లేని కొత్త సంప్రదాయాన్ని వివాదాస్పదం చేసి.. దానిపై రాజకీయం చేయడం గవర్నర్ స్థాయికి తగదని పేర్కొంటున్నారు. తన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని, అనేకసార్లు ఇబ్బంది పెట్టిందని గవర్నర్ విమర్శించారు. తనకు గౌరవం ఇవ్వకపోతే ఎవ్వరినీ లెక్క చేయనని కూడా హెచ్చరించారు. గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తంచేశారు.
రాజ్యాంగ పదవులను గౌరవించడంలో సీఎం కేసీఆర్‌కు సాటి ఎవరూ రారని వారు చెప్తున్నారు. సదరన్ కౌన్సిల్ సమావేశానికి సీఎం కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. తాను పుదుచ్చేరీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా హాజరయ్యానని గవర్నర్ అనడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లాలి? ఎటు వెళ్లరాదన్నది సీఎం కేసీఆర్ విచక్షణాధికారానికి సంబంధించినదని తెలంగాణ వాదులు వ్యాఖ్యానిస్తున్నారు.