హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎప్‌సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) నోటిఫికేషన్ ఈ నెలాఖరులో విడుదలకానున్నది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 22న నోటిఫికేషన్ ఇస్తారని తెలిసింది. ఈ నెల 27, 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఇంటర్ హాల్‌టికెట్లతో దరఖాస్తుల స్వీకరణ ముడిపడి ఉన్నందున నెలాఖరు నుంచే దరఖాస్తులను స్వీకరించాలని అధికారులు నిర్ణయించారు. టీఎస్ ఎప్‌సెట్ కమిటీ, పీజీఈసెట్ కమిటీ మంగళవారం సమావేశంకానున్నాయి. సమావేశంలో సిలబస్ ఆమోదం సహా షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉన్నది. నిరుడు ఇంటర్ ఫస్టియర్‌లో 70శాతం, సెకండియర్‌లో 100శాతం సిలబస్‌కు నిర్వహించగా, ఈసారి 100శాతం సిలబస్‌కు నిర్వహించే అంశాన్ని సెట్ కమిటీ సమావేశం ఎజెండాలో చేర్చింది. మంగళవారం సమావేశంలో సిలబస్‌ను ఆమోదిస్తారు. నిరుడు ఎప్‌సెట్‌లో ప్రశ్నల వెయిటేజీలో మార్పులు చోటుచేసుకోగా, ఈ ఏడాది ఫస్టియర్‌కు, సెకండియర్‌కు సమాన వెయిటేజీని అమలుచేస్తారు.
ఎప్‌సెట్ కో-కన్వీనర్‌గా విజయ్‌కుమార్‌రెడ్డి
ఎప్‌సెట్ కో-కన్వీనర్‌గా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. గతంలో విజయ్‌కుమార్‌రెడ్డి ఈసెట్ కన్వీనర్‌గా, ఎప్‌సెట్ కో-కన్వీనర్‌గా సేవలందించారు. పీజీఈసెట్ కో-కన్వీనర్‌గా ప్రొఫెసర్ రవీంద్రారెడ్డిని నియమించారు. ఎప్‌సెట్ కో ఆర్డినేటర్లుగా తారాకళ్యాణి, దుర్గాకుమార్, పీజీఈసెట్ కో ఆర్డినేటర్‌గా డాక్టర్ సత్యనారాయణ నియమితులయ్యారు.