TS EAMCET | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ఎంసెట్ ఇంజినీరింగ్ తుది విడత వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 4న ప్రారంభంకానున్నది. శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు, స్లాట్‌బుకింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. 9న సీట్లు కేటాయిస్తారు. దీంతోపాటు స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా బుధవారం అధికారులు విడుదల చేశారు. 17 నుంచి ఈ కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తారు. రెండో విడత కౌన్సెలింగ్ ముగిశాక బీటెక్ కోర్సుల్లో మొత్తం 12,013 సీట్లు మిగిలాయి. సీఎస్ఈ, ఐటీ అనుబంధ కోర్సుల్లో 3,137, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో 3,805, మెకానికల్, సివిల్ కోర్సుల్లో 4,592, ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో 479 చొప్పున సీట్లున్నాయి. వీటితోపాటు ఆన్లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయని పక్షంలో మరికొన్ని సీట్లు మిగులుతాయి. ఈ మొత్తం సీట్లను తుది విడత కౌన్సెలింగ్‌లో భర్తీచేస్తారు. ఈ కౌన్సెలింగ్ ముగిశాక 23న స్పాట్ ప్రవేశాల కౌన్సెలింగ్ మార్గదర్శకాలను విడుదల చేస్తారు. ఇక తుదివిడత కౌన్సెలింగ్‌లో స్పోర్ట్స్, ఎన్సీసీ కోటా సీట్లను కూడా భర్తీచేయనున్నారు. ఈ కోటా విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
ఇంజినీరింగ్ సీట్లను ఏటా మూడు విడతల్లో భర్తీచేస్తారు. విద్యార్థుల నుంచి వచ్చే అభ్యర్థనలను బట్టి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గతంలో కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయకముందే స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించేవారు. ఇప్పుడు సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్ట్ చేసిన తర్వాత మరో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించడం, ఈ విడతలో సీట్లు పొందిన వారు మళ్లీ రిపోర్ట్‌చేయడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు.